2028 నాటికి 6G వస్తోందా? దాని ద్వారా వచ్చే ప్రయోజనాలివి!

2028 నాటికి 6G వస్తోందా? దాని ద్వారా వచ్చే ప్రయోజనాలివి!


ప్రపంచ వ్యాప్తంగా అన్ని టెలికాం సంస్థలు 5G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూంటే.. మరోవైపు తాజాగా Samsung Research సంస్థ 6G technology గురించి శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.

5Gలో ఉన్న లోపాలను సరి చేస్తూ, ప్రపంచంలో ఉన్న ఏదైనా దేంతో అయినా ఇంటర్నెట్ ద్వారా కనెక్టివిటీ సాధించగలిగే విధంగా 6G టెక్నాలజీ ఉంటుందని సాంసంగ్ అభిప్రాయపడుతోంది. 1000 Gbps స్పీడ్ దీని ద్వారా లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మనుషులను వివిధ రకాల వస్తువులతో వర్చ్యువల్‌గా కనెక్ట్ చెయ్యడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇటీవలికాలంలో కానీ పెరుగుతున్న లేటెస్ట్ టెక్నాలజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి రంగాలు 6G టెక్నాలజీ ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందబోతున్నాయి. ఒకదానితో మరొకటి కనెక్ట్ అయ్యే మెషిన్లు, వైర్లెస్ కమ్యూనికేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడం వంటి ప్రాధాన్యతలను 6G తీరుస్తుందని Samsung చెబుతోంది.

6Gని సాధించే క్రమంలో మరింత మెరుగైన మొబైల్ బ్రాడ్బ్యాండ్, ఎలాంటి డేటా లాస్ లేని, తక్కువ లేటెన్సీ కలిగిన కమ్యూనికేషన్, mMTC వంటి టెక్నాలజీలు మరింత శక్తివంతం అవుతాయని సాంసంగ్ అభిప్రాయం. దీని ద్వారా బయటి ప్రపంచానికి ఊహాజనిత ప్రపంచానికి ఏమాత్రం వ్యత్యాసం లేని extended reality (XR), హై-ఫిడిలిటీ మొబైల్ హోలోగ్రామ్, డిజిటల్ రిప్లికా వంటి కొత్త టెక్నాలజీలు సాధ్యపడతాయి. గతంలో వివిధ జనరేషన్ నెట్వర్క్‌లు అందుబాటులోకి వచ్చిన క్రమాన్ని ఆధారంగా చేసుకొని 6G ప్రపంచానికి 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని Samsung చెబుతోంది. 2G నుండి 3G అభివృద్ధి చెందడానికి 15 సంవత్సరాల సమయం పడితే, అదే 4G నుండి 5G రావడానికి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే సమయం పట్టింది.

దీనికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడు మెరుగైన టెక్నాలజీ అందుబాటులోకి రావడం, అలాగే మార్కెట్లో కూడా మొబైల్ కమ్యూనికేషన్ కి గతంలో కంటే విపరీతంగా డిమాండ్ పెరగడంగా చెప్పుకోవచ్చు. 2028లో అందుబాటులోకి వచ్చిన పూర్తిస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించడానికి 2030 వరకు సమయం పడుతుందని Samsung అంచనా!
-Pavan Buddhu

0 Comments